కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా
గీత రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : కోట కృష్ణవేణి,
గానం : మూల శ్రీలత, టి కృష్ణారావు
రికార్డింగ్ : శ్రీమాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
ప్రొడక్షన్ : RKSS Creations
పల్లవి:
(గోపికలు):
కన్నెల మనసులు దోచుకు పోయిన
కన్నయ్య ఏడమ్మా
పున్నమి జాబిలి చిన్నబోయిన
వన్నెల కాడమ్మా
మురళీ గానము మధురిమలో మేము
కన్నులు మూయంగా
అల్లరి కృష్ణుడు అందాల కృష్ణుడు
చెంగున మరుగాయె
చరణం:
కృష్ణయ్య లేని తనువులు మేము
మోయంగ లేమమ్మా
ఆతని వేణువు మాధుర్యమే మా
ఊపిరి నిలుపమ్మా
ఆ కాలి మువ్వల సవ్వడులే మాకు
చేతన మిచ్చేది
ఆతడు లేని అరక్షణమైన
జీవించ లేమమ్మా
చరణం:
ఓ భూమాతా నీ వైన మా స్వామి జాడ
పరికించి తెలుపమ్మా
ఓ పున్నాగ, కదంబ, మారేడు, మామిడి
మీరైనా చెప్పండి
ఓ మల్లీ జాజీ సంపెంగ పూలారా
వనమంతా వెదకండి
ఓ వన మయూరమా శిఖిపింఛ మౌళిని
వెదకి తేవమ్మా
చరణం: (కృష్ణుడు...)
ప్రతి తరవు నందు నిలిచింది నేనేగా నేనేగా…
ప్రతి పులుగు నందు చేతనము నేనేగా.. నేనేగా..
ప్రతి పూవు నందు పరిమళము నేనేగా… నేనేగా…
భువిలోన దివిలోన ప్రతి అణువులోన నేనేగా… నేనేగా…
ఓ చెలులారా మీ హృదయాలలో
నేనెపుడూ బందీగా వుంటాను
కన్నెల మనసున నిలచి పోయిన
కన్నయ్య వీడమ్మా
పున్నమి జాబిలకీ కన్నెల సొగసుల
చందము ఏదమ్మా
- రామకృష్ణ దువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి