జయ జయ వినాయకా
రచన : రామకృష్ణ దువ్వు
సాకి:
అనింద్య వాహనా అపర్ణ తనయా
కుడుములు గైకొని వరముల నొసగే
ఆనంద రూపా కైలాస నిలయా
ఆటంకాలను ఆవిరి చేసే గణపతి దేవా
పల్లవి:
జయ జయ వినాయకా
జయ గణ నాయకా..
విజయాలను మాకు చేరువ చేసే
మంగళ మూర్తి వినాయకా…
జయ జయ వినాయకా
చరణం 1:
కైలాసమీడి ప్రతి ఏడాదీ
ఆకాశ వీధిని మాకోసమొచ్చేవు
ఊరూరనిలచి మా పూజలు
గైకొని వరముల నిచ్చేవు
కుడుములతోనే సంతసించి
ఎనలేని మా కోర్కెలు తీర్చేవు
నువు నీట మునిగి నీతోనే
మా కష్టాలు నీట ముంచేవు
నీరాక కోసం మరు ఏడాది
మేము ఎదురు చూచేము
జయ జయ వినాయకా
జయ గణ నాయకా..
విజయాలను మాకు చేరువ చేసే
మంగళ మూర్తి వినాయకా…
జయ జయ వినాయకా
చరణం 2:
శ్రీ లక్ష్మీ గణపతిగ పూజలందుకొని
ప్రతినింటా సిరుల సంపదలిచ్చేవు
విద్యా గణపతివై వాడల వీధుల
మము బ్రోచి మాకెంతో జ్ఞానమిచ్చేవు
మూషిక వాహనుడై ఊరేగు వేళ
వాహన భాగ్యము అనుగ్రహించేవు
మహా గణపతిగా తోడుగ నిలచి
ఇంటింటి పెద్దవై జయములు కూర్చేవు
జయ జయ వినాయకా
జయ గణ నాయకా..
విజయాలను మాకు చేరువ చేసే
మంగళ మూర్తి వినాయకా…
జయ జయ వినాయకా
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి